Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page

జీవనయాత్రలో పరమావధి

శరీరపోషణం ఒకవృక్ష పోషణం వంటిది. ఏ చెట్టులోనైనా చివరకొక పండు పండుతుంది. అలాగే మనిషి మనస్సూపక్వం కావాలి. ఎంత పుల్లని పండైనా సరే, చేదుపండైనాసరే చివరకు దానిలో ఒక మాధుర్యం కొంతకుకొంతైనా వస్తుంది. మనం కూడా కొంతకు కొంతైనా , మధురానుభూతిని సాధించాలి. మన జీవన యాత్రకు అదే పరమావధి.

కాళిదాసు మహాకవి భోజరాజు కాలంలోని వాడు. భోజరాజు ధారానగరానికి అధిపతి. అతని ఆస్థానంలో వ్యాకరణపండితులూ, కవులూ విశేషంగా వుండేవారు. తుదకు భోజుని చూస్తేనే కవిత్వం వస్తుందన్న ప్రశస్తికూడా ఏర్పడింది.

ఈ భోజరాజు తనతరువాత తన్ను గూర్చిన ప్రశంస ఎలా వుంటుందో వినాలని కుతూహలపడినాడు. కవులు చరమశ్లోకం చెబుతారు. భోజరాజు తన చరమశ్లోకం వినాలని కోరాడు. కాళిదాసును తన పై చరమశ్లోకం చెప్పమని ఆదేశించాడు. కవివాక్కు ఆమోఘం కనుక కాళిదాసు ఒప్పుకోలేదు. రాజుకు కోపం వచ్చి రాజ్యంనుండి వెళ్లగొట్టినాడు. ఐనా ఆయన కోరిక నెరవేరలేదు.

అందుచేత రాజు మారువేషం వేసుకొని కాళిదాసు ఉన్నచోటుకు ప్రచ్ఛన్నంగా వెళ్ళి భోజరాజు మరణించాడన్న వార్తను అతనికి విన్నవించాడు. తనను వెళ్లగొట్టినా కాళిదాసుకు రాజుపై ఏమికోపం ఉంటుంది? భోజరాజు యొక్క సారస్వత సేవ అపూర్వమైనదనే అతని ఉద్దేశం.

అందువల్ల అతడు భోజరాజుపై చరమశ్లోకాన్ని ఇలా చదివినాడు.

అద్య ధారా నిరాధారా నిరాలంబా సరస్వతీ |

పండితాః ఖండితాః శ్ఛైవ భోజరాజే దివంగతే ||

భోజరాజు స్వర్గానికి వెళ్ళాడు. అంతటితో ధారా నగరానికి ఆధారం పోయింది. సరస్వతి కిపుడు అచట ఆలంబనంలేదు. అందువల్ల పండితులంతా ఖండితులైనట్టే - అని దీని అర్థం.

ఇంకేముంది అది మహాకవి వాక్కు. సత్త్వశుద్ధికల సారస్వతో పాసకుని వాక్కు. కాళికానుగ్రహం పొందినవాడాయన. అది వ్యర్థం కావడానికి వీలులేదు. వాజ్నియమంతో వుండే వారి వాక్కు ఫలించక తప్పదు.

( 9 - 12 )

వెంటనే ఆవార్త తెచ్చిన ఆసామీ చనిపోయి పడి ఉన్నాడు. అదేమని పరిశీలించగా, ఆయన వేషం, గడ్డం అవీ తొలగించగా ఆయన భోజరాజుని తేలింది. తన కోరికను తీర్చుకోవడానికి రాజు ఇట్లు మారు వేషంలో వచ్చాడని కాళిదాసు తెలుసుకొన్నాడు. తన వాక్కును ఇదా ఫలమని విచారించాడు. వెంటనే తన అమోఘవాక్కుకు మరొక అవకాశం ఇచ్చాడు. సత్యసిద్ధునకు వాక్శుద్ధి వుంటుంది. అపుడు చరమశ్లోకాన్ని త్రిప్పి ఇలా చదివాడు.

అద్య ధారా సదాధారా సదాలంబా సరస్వతీ |

పండితాః మండితా శ్చైవ భోజరాజే భువంగతే||

భోజరాజు భువిలోకి వస్తున్నాడు. ఇపుడు ధారా నగరానికి మంచి ఆధారం వచ్చింది. సరస్వతికి మంచి ఆలంబనం దొరికింది. పండితులు మండితులైనారు - అని దీని అర్థం.

వెంటనే కవివాక్కు ఫలించింది. భోజుడు సజీవుడు అయ్యాడు. ఐతే ఇది ఎంతసేపు? కొంతసేపు మాత్రమే. అందువల్ల వారుభయులూ ఆసమయాన్ని సార్థకం చేసుకోవాలని, రామకథ వ్రాయాలనీ అనుకొన్నారు. కేవలం పద్యం కాక, కేవలం గద్యమూకాక, గద్యపద్య ఉభయాత్మకమైన కావ్యాన్ని చంపూ అంటారు. అలాంటి రామాయణ చంపువును వ్రాయాడానికి పూనుకొన్నారు.

ఐతే కాళిదాసు రఘువంశమనే కావ్యంలో రామకథనం చేశాడు. ఐనా రాజుకు తరణోపాయంగా వుంటుందని ఉభయులూ రామకథ ఆరంభించారు. జన్మ తరించవలెననేదే వారి ఆశయం.

అప్పుడప్పుడు ధర్మగ్లాని జరగడం, రాక్షస బాధ కలగడం పరిపాటి. అలాంటప్పుడు అవతరించిన వాడే రాముడు, కృష్ణుడు, శంకరాచార్యులవారు మొదలైనవారు.

రాక్షసబాధ పడలేక దేవతలు వైకుంఠవాసుని ప్రార్థన చేయుడంతో భోజచంపువు ప్రారంభమవుతుంది. ఇలా ధ్యానించిన శ్లోకాలలో ఒకటి భోజరాజు, తరువాత కాళిదాసు, వరుసగా ఒకరి తర్వాత ఒకరు జంటకవులుగా, చెప్పటం ప్రారంభించారు.

సంతాపఘ్నం సకలజగతాం శార్జచాపాభిరామం

లక్ష్మీవిద్యుల్లసిత మతసీ గుచ్ఛసచ్ఛాయకాయం|

వైకుంఠాఖ్యం మునిజన శ్చాతకానాం శరణ్యం

కారుణ్యాసం త్రిదశ పరిషత్కాలమేఘం దదర్శ||

క్షీరాంబోధే ర్జటర మభితో దేహభాసాం ప్రరోహై

కాలోన్మీల త్కువలయదళా ద్వైత మాపాదయంతం|

ఆతన్వానం భుజగశయనే కామపి క్షామగౌరే

నిద్రాముద్రాం నిఖిలజగతీ రక్షణ జాగరూకామ్‌||

ప్రహ్లదస్య వ్యసనమమితం దైత్యవర్గస్య దంభం

స్తంభం పక్షస్థలమపి రిపో ర్యౌగపద్యేన భేత్తుం|

బద్ధశ్రద్ధం పురుషవపుషా మిశ్రితే విశ్వదృష్టే

దంష్ట్రా రోచి ర్విశదభువనే రంహసా సింహవే షే||

నారాయణాయ నలినాయత లోచనాయ

నామావశేషిత మహాబలి వైభనాయ|

నానాచరాచర విధాయక జన్మదేశ

నాభీపుటాయ పురుషాయ నమః పరసై#్మ||

ఇందులో శ్రీ మహావిష్టువు పాలసముద్రంలో శేషతల్పశాయియై ఉన్నాడు. అదే ప్రబోధం - ప్రబోధైకాదశి, ఆనాడే మనం ఉపిరిక, తులసీవృక్ష సన్నిధిలో శ్రీ మహావిష్ణు సాన్నిధ్యంవుందని వాటి పూజలు చేసి, అక్కడ భోజనాలు చేస్తాం.



మన ధర్మశాస్త్రంలో చాతుర్మాస్యం అని ప్రసిద్ధంగా ఉన్నది. ధర్మశాస్త్ర కర్తలలో ఆపస్తంబ, ఆశ్వలాయన సూత్రకర్తలున్నారు. ఒక్కొక్క వేదశాఖను అధ్యయనం చేసేవారికి ఒక్కొక్క సూత్రకర్త నిషేకాది శ్మశానాంత కర్మకాండను విధించాడు. కృష్ణయజుర్వేదీయులకు, ఆపస్తంబుడు విధించాడు. అలాగే ఇతరులకు ఆశ్వలాయనాదులు. వీటిని సంస్కారాలు అని అంటారు. మాతృగర్భంలో ప్రవేశించినది మొదలు తుదకు ఈ శరీరం అగ్నిలో ఆహుతి అయ్యేవరకు సంస్కారాలను విధించి ఉన్నారు.

అందులో వారు నాలుగవ ఆశ్రమమైన సన్యాసులకు ఈ చాతుర్మాస్య వ్రతాన్ని నిర్దేశించారు. ఈ శాస్త్రాన్ని అనుసరించే సన్యాసు లీవ్రతం చేస్తున్నారు. వేదంలో 'పక్షావై మాసాః' అని చెప్పి ఉండటం చేత నాలుగు పక్షాలు అనగా రెండుమాసాలు. ఈ వ్రతం ఆచరింపబడుతున్నది.

మన ధర్మశాస్త్ర విధిని చూచే బౌద్ధభిక్షువులు కూడా ఈ చాతుర్యాస్యాన్ని అనుష్ఠించారు. జైనులు కూడా దీనిని అనుకరించారు.

సన్యాసులు ఇలా ఉండటం, గృహస్థులు వీరినారాధించటం ఆచారంగా ఉంది.

భోజచంపువులో కథ జరుగుతున్నది కదా! అందులో చక్కని పాలసముద్రంలో చల్లని శేషతల్పంమీద క్షీరసాగర శయనుడు మహావిష్ణువు పవ్వశించివున్నాడు. ఆయన నిద్రాముద్రలో వున్నాడట, ఒక్కొక్క అవస్థకు ముద్ర అనిపేరు. మంత్రశాస్త్రంలో అనేక ముద్రలున్నవి. ఉపాసనలో ముద్రలు, పూజలో ముద్రలు, నాట్యశాస్త్రంలో ముద్రలు - వానికీ పేర్లు వున్నాయి. వీనినన్నిటిని గురుముఖతః గ్రహించాలి. శంఖముద్ర అందరికీ శంకపూజలో అవసరం. నేనిపుడు దాన్ని చూపిస్తున్నాను. చూడండి ఇలాగే చిన్ముద్ర, జ్ఞానముద్ర, అలాగే సన్ముద్ర ఉంది. ఆనందముద్రకూడా ఉంటుంది. నటరాజమూర్తి సత్‌, చిత్‌, ఆనందమూర్తియై నాట్యంచేస్తూ ఉంటాడు.

కాని పరిపాలించవలసిన నారాయణమూర్తి నిద్రాముద్రలో ఉంటాడు. సర్వలోకరక్షకుడు, పరిపాలించేవాడు. కుంభకర్ణుడివలె నిద్రపోతే ఎట్లా? దైవవిగ్రహాలు కూర్చుండో , నిలబడి ఉండటమో చూస్తున్నాం. కాని అనంత పద్మనాభమూర్తి మాత్రం ఎపుడు నిద్రాముద్రను దాల్చి వుంటాడు. ఆముద్ర 'నిఖిలజగతీరక్షణ జాగరూకం'- అఖిల ప్రపంచాన్ని అది రక్షిస్తూవుండే ముద్ర అట! నిద్రపోతున్నా, రక్షణలో మాత్రం వారికే జాగ్రత్త అట!

సర్వలోకరక్షకుడైన ఈయనకు ఈ నిద్ర ఏమి? సర్వలోకసంహారకుడైన శివునికి ఈ ఆనందతాండవ మేమిటి?

సర్వప్రపంచాన్ని పరిపాలించడానికి సావధానంగా ఉండేదే నిద్రాముద్ర. కొంతమంది నిపుణులు ఉంటారు. వారు నిద్రపోతూనే పాలిస్తారు. మరి, వారు మేలుకోకుండానే పరిపాలన జరుగుతుంది. అలాగే నారాయణమూర్తి కూడా తాను మేలుకోకుండానే ప్రపంచం జరుగుతూ వుందా, లేదా! అని చూస్తూ ఉంటారు.

అరవిందులు మొదట రాజకీయాలలో ఉండి తరువాత ఆధ్యాత్మికానికి వచ్చారు. పాండిచేరిలో వారు పెద్ద ఆశ్రమం రూపొందిచారు. కర్మయోగి అనే పత్రికను ప్రచురించేవారు. తీవ్రరూపమైన కర్మ ప్రభావం అని వీరు ప్రభోధించారు. తీవ్రకర్మయోగం అని కూడా దీనిని వ్యవహరిస్తారు. వివేకానందులకు కూడా ఇదే అభిప్రాయం ఉండేది. తిలక్‌ భగవద్గీతకు కర్మపరంగా వ్యాఖ్యవ్రాశారు. 'తస్మాద్‌ యుధ్యస్వ భారత' - అని ఉన్నదికదా అని వీరి అభిప్రాయం. సన్యాసులు ముక్కుపట్టుకొని కూర్చుంటారు. ప్రపంచానికి వీళ్ళంతా సర్వీసు చేయాలి, అని వీరి అభిప్రాయం. బౌద్ధంలో హీనయాన, మహాయానములు ఏర్పడినవి. ఇందులోనూ ఉద్ధరే దాత్మ నాత్మానం' అనే పద్ధతి ఒకటి. లోకసేవ మరొక పద్ధతి.

ఆదిలో శంకరులు భగవద్గీతకు భాష్యం వ్రాశారు. అందులో జ్ఞానం ముఖ్యం అని వారన్నారు. కర్మను నిరసించారు. కాని గీత కర్మశాస్త్రమనే పై చెప్పిన వారి అభిప్రాయం. జ్ఞానాన్ని బోధించేవి. వేరే ఉపనిషత్తు లున్నాయి. అని వీరి ఉద్దేశం 'అథ పరబ్రహ్మాత్మ నాస్థీయతాం', అనే ఆది శంకరుల అభిప్రాయాన్ని వీరంతా ఖండించారు.

శంకరులు 'నిజగృహా త్తూర్ణం వినిర్గమ్యతాం', 'త్యాగేనైకే నామృతత్వ మానశుః' అని చెప్పారు. అంటే ఇంటినుండి వెంటనే బయటకు వెళ్ళమన్నారు. త్యాగం వల్లనే అమృతత్వం సిద్ధిస్తుందని చెప్పారు. ఇందుకే సన్యాసం పుచ్చుకోవాలని వీరి తాత్పర్యం. ఐతే తీవ్రకర్మవాదులైన అరవిందులు సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చి దర్శనం ఇచ్చేవారు. అది నాకిక్కడ జ్ఞాపకం వచ్చింది జ్ఞానబోధకులైన శంకరులు దేశమంతా సంచరించారు.

ఆజ్ఞాచక్రం అని ఒకటి వుంటుంది. పరిపాలకుల ఆజ్ఞవల్ల వ్యవహారం అంతా జరిగిపోతూ వుంటుంది. శ్రీ నారాయణ మూర్తి ఆజ్ఞాచక్రంవల్ల ఆయన నిద్రాముద్ర ధరించినా, అది నిఖిలజగతీరక్షణ జాగరూకమని చెప్పబడింది. ఐతే కొంతకాలం నిద్రించి మరల మేల్కొంటే అదినిద్ర. ఎప్పుడూ నిద్రైతే అది నిద్రకాదు. దానిని కోమ అంటారు.

మేము ఇక్కడ గడిపింది ఉత్తరచాతుర్మాస్యం అని చెప్పవచ్చును. ఇందులో కృష్ణాపుష్కరం కలసిరావటమేకాదు. భారతదేశంలోని వేదవిద్యార్థులు చాలమంది ఇక్కడకు (విజయవాడలో హరిహర బ్రహ్మక్షేత్రము) వచ్చారు. వేద సమ్మేళనం జరిగింది. ఐతే ఇలాంటి సభ యాభై ఏళ్ళ క్రితం కాని జరిగివుంటే కొన్ని వేలమంది విద్యార్థులు వచ్చి వుండేవారు.

భోజచంపువుల్లో తరువాత శ్లోకంలో 'ప్రహ్లాదస్య వ్యసనమమితం' అని ఉన్నది. ప్రహ్లాదుని దుఃఖాన్ని భేదించడానికి 'నరుడు - సింహం' కలసిన నారసింహమూర్తి అవతరించారు. ఈయన స్తంభాన్ని భేదించాడు. అంతేకాదు. ప్రహ్లాదుని దుఃఖాన్ని దైత్యులమదాన్ని నాస్తిక మనోభావాన్ని,హిరణ్య కశివుని రొమ్మునూ - స్తంభంతోపాటు ఒక్క మారుగా భేదించారు. స్విచ్చివేస్తే లైట్లు వెలిగేటట్లు ఈ కార్యం జరిగిందన్నమాట. ఇదంతా భక్తునికి ఏకాంతంలో జరిగిన అనుగ్రహం కాదు. ఆయనకు మాత్రమే అది పరిమితం కాలేదు. భక్తుని బహిరంగంగా విశ్వదృష్టితో చేశారు.

ఇక్కడ పుష్కరాలలో ఎగ్జిబిషన్‌ సర్కస్‌ మొదలైన ప్రదర్శనాలు ఏర్పరచారు. రోగం దరిద్రం, దానివల్ల అప్పులు, అజ్ఞానం. రోగాలకోసం. ఆసుపత్రులు; ఋణదాతల వడ్డీ బాధలు లేకుండా బ్యాంకులు, పరపతి సంఘాలు, ఏర్పరుస్తున్నారు. అజ్ఞానం పోవడానికి పాఠశాలలు కాలేజీలు పెట్టిస్తున్నారు. ఫ్యాక్టరీలు, వగైరాలు పెట్టించి అధికోత్పత్తిని చేయిస్తున్నారు. ప్రజల కష్టాలు తగ్గించి, సుఖంశాంతి వృద్ధి చేయడానికి యత్నం చేస్తున్నారు.

ఇవన్నీ ముందు ఇంతగాలేవు. ఇప్పుడు ఇవన్నీ ఉండటం వల్ల ఎక్కువ సుఖం శాంతి, జ్ఞానం వస్తున్నదా? అని ప్రశ్న. మనం చెప్పలేం. ఇతర దేశాలలో ఇవన్నీ మన దేశంకంటే ఎక్కువ పాళ్ళలో వున్నాయి. అక్కడ సుఖశాంతుల వృద్ధి ఐందా అని చూడాలి.

ప్రస్తుతం ఆసుపత్రులు పెరిగినా రోగాల సంఖ్య ఏమీ తక్కువ కాలేదు. బ్యాంకులు పెరిగినా ఓవర్‌ డ్రాప్టింగ్‌ తగ్గలేదు. పోగా సహాయం పొందే వాళ్ళకంటే మోసంచేసేవాళ్ళ సంఖ్య వృద్ధి అవుతువుందని అనాలి. వినయం విద్యకు ఫలమైతే . నేటి విద్యాలయాలలోని చదువు వినయం ఇవ్వటం. లేదు.

( 9 - 13 )

కాని, మానవులలో శాంతంగావుండే వాళ్ళు సహజంగా వుంటారు. ఆపదలలో కానీ, ద్రవ్యం నష్టమైనప్పుడు కానీ సంతోషంగా వుండే వాళ్ళున్నారు. బీదతనంలో కూడ శాంతంగావుండే వాళ్ళున్నారు. మహదైశ్వర్యంలో ఉన్నా' కొద్దినష్టానికే విశేషదుఃఖం అనుభవించేవాళ్ళూ ఉన్నారు.

పూర్వం మలేరియా వ్యాధికి పోస్టాఫీసులో మందుబిళ్ళలిచ్చేవారు. అవి తాత్కాలికమైన ఉపశమనం ఇచ్చేవి. మానవునికి ఇట్లా తాత్కాలిక ఉపశాంతికాక శాశ్వతమైన ఆనందం వుండాలి. శాంతికి కారణమైన మంచిమందు కావాలి. హోమియోవైద్యంలోలాగా ఏదైనా ఏకమూలికా ప్రయోగం కావాలి.

దరిద్రం దుఃఖం వ్యాధీ అజ్ఞానం, దౌష్ట్యం, దొంగతనం పోగొట్టి శాంతినిచ్చే ఇనిస్టిట్యూషన్‌ రావాలి. అదే శాంతికి కారణమౌతుంది.

మనలో ముసలమ్మలు డబ్బంతా దేవాలయాలకో, గోపురాలకో ఖర్చుచేస్తారని కొంతమందికి విసుగుగా ఉంటుంది. రాళ్ళకోసం ఖర్చుచేయటం నష్టం అని అనుకొంటారు. దాంతో ఏ ఆసుపత్రో, విద్యాలయమో కట్టించకూడదా అని అంటారు.

సందర్భం వచ్చిందికనుక, ఆలయగోపురాల విషయం పరిశీలిద్దాం. గోపురాన్ని ఎంతదూరం నుంచిఐనా దర్శిస్తే ఆ క్షణమైనా భగవంతుడు స్మరణకు వస్తాడు. ఇట్లే సాత్త్విక సాంగత్యం వల్ల వారి లక్షణాలు మనకు అబ్బుతవి.

'శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం' అని ఈశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాం. ఒక్క క్షణం ధ్యానించినా, ఆ శాంతలక్షణాల భావన మనకు కల్గుతూవున్నది.

శరీరసంరక్షణకోసమే ఇన్ని పాట్లు పడుతున్నాం. ఏవృత్తి చేసి సంపాదించినా' పొట్టకూటికే కదా. ఇంతగా రక్షిస్తే, ఈ శరీరం శాశ్వతంగా వుంటుందా? ఉండదు. మరి దీన్ని పోషించకపోతే ఏం? చస్తుంది. చస్తేఏం? దీనికి సమాధానమేమి? ఇది తుది ప్రశ్న.

ఆదిశంకరులు తమభాష్యంలో ఈ అంశాన్నే చర్చించారు. బుద్ధి, ఇంద్రియాలు ఈ శరీరాన్ని ఆశ్రయించివున్నాయి. అందుకే శరీరరక్షణ. ఈశ్వరసేవనానికే ఈ శరీరం కావాలి. ఆయనే సృష్టికర్త, ఫలదాత కూడాను. ఇతర మతస్థులుకూడా ఇలాగే అనుకొనే వారున్నారు. శిక్షవల్ల భయపడటం కూడా ఉన్నది.

దక్షిణామూర్తి ఆనందంగా వుంటాడు. ఆయన నిర్లిప్తుడు, మౌని. ఆమూర్తిని ఎంత కాలం ధ్యానిస్తే అంతశాంత సౌఖ్యాలు మనకు లభిస్తవి. 'అశాంతస్య కుత స్సుఖం' అని గీత అంటుంది. త్యాగయ్య దీనిని అనువదించారా అన్నట్లు - 'శాంతములేక సౌఖ్యము' లేదన్నారు.

శాంతుడై పద్మాసనంలో ఉండేవాడు ఈశ్వరుడు. ఆయనే హరిహరమూర్తి, పుస్తకాలు ఎన్నివ్రాసినా చదువు కొన్న వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఆలయాలు గోపురాలు కొందరికీ ఉపయోగపడుతవి. నాస్తికునకు కూడా దృష్టి మళ్ళినపుడు ఆరంభంలో ఎట్లావున్నా క్రమంగా అది సత్ఫలదం కావచ్చు.

నేనిక్కడ చంద్రమౌళీశ్వర ప్రతిష్ఠచేశాను. అన్ని రోగాలకు ఇది పెద్ద ఆసుపత్రి. ఇదే పెద్దకాలేజి. పెద్దబ్యాంకు అన్ని విధములైన శాంతిసౌఖ్యములు దీనివలన పొందవచ్చును. భక్తికలగాలి. భక్తులను ఎల్లపుడూ భగవంతుని స్మరణమే. కొందరకు ఈశ్వరుని పిచ్చిపట్టుకొంటుంది. ప్రతి ఇంటిలోనూ పూజకొక గది ఏర్పరుచుకొంటారు.

మా చర్చిలలో ప్రశాంతంగా వుంటుంది. మీ దేవాలయాలలో గోల ఏం ప్రార్థనసాగుతుందని కొందరు అడుగుతుంటారు. నాకు తెలిసిన పెద్ద కమ్యూనిస్టు (కోయస్లర్‌) ఒకాయన ఉన్నాడు. ఆయన తర్వాత పెద్ద కేథలిక్‌ గా మారాడు. ఆయన వెనుకటి పార్టీ ప్రచారంలాగే, దీనిని కూడా తీవ్రతరంగా చేయాలని అభిప్రాయపడ్డాడు జపాను వెళ్ళాడు. ఇండియాకు వచ్చాడు. మన దేవాలయాలలో జరిగేది సామూహికోపాసన. ఉపాసనలో సామూహమేలేదని వారి అభిప్రాయం.

అన్నం, వస్త్రం, సుగంధాలు - ఇలా ఈశ్వరుడు ఎన్నో సృష్టించాడు. అదే దివ్యశక్తి. ఆయనే జ్ఞానదాత. సమూహం అనేది జీవనానికే అని కొందరి అభిప్రాయం. మన అభిప్రాయంలో మనకు ఈశ్వరుడు ప్రసాదించిన వానినన్నిటినీ ఈశ్వరునికి సమర్పించాలని మన ఆశయం. లేకపోతే కృతఘ్నులం అవుతాం.

అట్టి ఈశ్వరశక్తికి చిహ్నమైనదే లింగం. దానికి కరచరణాద్యంగములు లేవు. సమస్తం అందులోనుంచే ప్రభవిస్తున్నది. శివాలయంలో ఈశ్వరార్పణంగా నివేదన జరిగిన పిదప గంటమ్రోగనిదే మనం భోజనం చేయకూడదు.

రాజోపచారాలు, దేవోచారాలు ఈశ్వరునికి ఎవరికివారు ప్రత్యేకంగా చేయాలంటే శక్తి చాలకపోతుంది. ఎవరికీ కృతఘ్నతా దోషంరాకుండా ఈశ్వరాలయంలో సామూహికోపాసన ఏర్పరుచుకొన్నాం. వ్యక్తిగతమైన ఉపాసనలకు, మన గృహంలోని పూజా మందిరములు ఏర్పడినాయి.

పై చెప్పిన కేథలిక్‌ మతస్థునికి ఈ విషయాలన్నీ సమాధానంగా చెప్పాను. స్వాములవారు బాగానే చెప్పారు. కానీ ఏ ఇంట్లోనూ ఒక్క పూజాగృహం కూడాలేదు. ఈయన తప్పుకోవటంకోసం ఇలా చెప్పారని అన్నాడాయన.

ఒక వృక్ష్యాన్ని పెంచుతున్నాం. అది క్రమంగా పలాన్నిస్తుంది. అందులోని తీపి మనకు ఆనందకారణ మౌతుంది. మన శరీరం ఒక వృక్షం. దీని రక్షణమంతా ఆనందం అనే ఫలం కోసం. మన మనస్సు కూడా పండాలి. అంతవరకూ ఈ శరీరానికి ఆహారం వేసి దీనిని కాపాడాలి. అపుడు కానీ మన ప్రయత్నం ఫలించదు. ఈ అవసరం దీనితో మనకు లేకపోతే, ఈ శరీరంతో మనకు పనిలేదు. అన్నం అక్కరలేదు. ఉద్యోగాది శ్రమలు అక్కరలేదు.

భూమిలో విత్తిన బీజం అనేక పరిణామాలు పొంది తుదకు పండు పండినట్లే మన శరీరం పోషింపబడి మనస్సును పక్వంచేయాలి. ఎంతటి పుల్లని పండైనాసరే చేదుపండైనాసరే కడపటి వానిలో మాధుర్యం కొంతైనా రాకమానదు.

ఎక్కువ సమయాన్ని ఈశ్వరధ్యానం కోసం వినియోగించాలి. ఎక్కువధనాన్ని ఈశ్వరారాధనకు వినియోగించాలి. పొట్టకోసం చేసేపని అంతా ఈశ్వరానుగ్రహప్రాప్తికి సాధనం అని గ్రహించాలి.

రాజులు ఎన్నిచేసినా అన్నీ పోయినాయి. రాతితో కట్టించిన దేవాలయాలు మాత్రం మిగిలినాయి. వృద్ధి పొందుతున్నాయి. దేవాలయ స్థాపనకంటే, దాని సంరక్షణ చాల ముఖ్యం.

ఈ చాతుర్మాస్య కృష్ణా పుష్కరసమయం, ఈ హరిహర బ్రహ్మక్షేత్రంలో చక్కగా పూర్తి ఐంది. ఈ సంతోషాన్ని మీ అందరితో కలసి ఇపుడు చెప్పుకో కలిగాను. ఈ పట్టణ పౌరులందరికీ ఆరోగ్య భాగ్యాలు, విద్యావినయ సంపదలు, ఈశ్వర భక్తీ శాశ్వతంగా కలగాలని ఈశ్వరుణ్ణి అర్థిస్తూ ఉన్నాను.


Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page